మోడీ కన్నీళ్లు ప్రాణాలను కాపాడలేదు

వారి కుటుంబ స‌భ్యుల క‌న్నీళ్ల‌ను ప్ర‌ధాని మోడీ కార్చుతోన్న క‌న్నీళ్లు తుడవలేవు..రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశంలో క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై శ్వేతప‌త్రం విడుద‌ల చేసి విమ‌ర్శ‌లు గుప్పించారు. రెండో ద‌శ విజృంభ‌ణ‌కు కార‌ణాలు, మూడో ద‌శను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆయ‌న వివ‌రాలు తెలిపారు. ‘రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో మృతి చెందిన వారిలో 90 శాతం మంది స‌రైన వైద్య స‌దుపాయాలు అంద‌కే మృతి చెందారు. వారి మృతికి ముఖ్య కార‌ణం ఆక్సిజ‌న్ కొర‌తే. వారి కుటుంబ స‌భ్యుల క‌న్నీళ్ల‌ను ప్ర‌ధాని మోడీ కార్చుతోన్న క‌న్నీళ్లు తుడవలేవు. వారిని ఆయ‌న క‌న్నీరు కాపాడ‌లేదు.. ఆక్సిజ‌న్ మాత్ర‌మే కాపాడుతుంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

‘కానీ, వైద్య స‌దుపాయాల గురించి ఆయ‌న ప‌ట్టించుకోకుండా ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లపైనే దృష్టి పెట్టారు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన వారు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాల‌కు ప‌రిహారం కూడా చెల్లించ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంది. దేశంలోనే పెట్రోల్‌, డీజిల్ రేట్ల‌ను పెంచేసి రూ.4 ల‌క్ష‌ల కోట్లు ప్ర‌భుత్వం రాబ‌ట్టింది’ అని రాహుల్ గాంధీ చెప్పారు. ‘అయిన‌ప్ప‌టికీ క‌రోనా మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ఇవ్వ‌ట్లేదు. వారికి ప‌రిహారం అందించాల్సిందే. ఇక‌పై క‌రోనా మూడో ద‌శ విజృంభ‌ణ‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకోవాలి. మేము విడుద‌ల చేస్తోన్న శ్వేత‌ప‌త్రం ఈ విష‌యంపై బ్లూ ప్రింట్ వంటిది. మూడో ద‌శ క‌రోనా విజృంభ‌ణపై ఎలా స్పందించాలో తెలియ‌జేస్తుంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/