రైతులకు షాకింగ్ న్యూస్ తెలిపిన వాతావరణశాఖ

వాతావరణశాఖ రైతులకు షాకింగ్ విషయాన్నీ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడి దాదాపు నెల రోజులు అవుతుంది. నెల నుండి వర్షాలు పడకపోవడం తో రైతులంతా ఆకాశం వంక చూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ పిడుగులాంటి వార్త తెలిపింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని, ఇప్పటికే ఆగస్టు నెలంతా వాతావరణం పొడిగానే ఉందంటూ వాతావరణ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి.

దీంతో దేశంలో ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షాపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా అత్యధిక వర్షాపాతం నమోదైంది. జులైలో 489.9 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డు కాగా.. లోటు తీరినట్లయ్యింది. తెలంగాణలో 1972 తర్వాత ఆగస్టులో తెలంగాణలో అత్యల్పంగా వర్షాపాతం నమోదైంది. ఆగస్టులో కేవలం 74.4 మిల్లీమీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదు కాగా.. ఇది సాధారణం కంటే 60శాతం తక్కువ. 1960 నుంచి రాష్ట్రంలో ఇంత తక్కువగా వర్షాపాతం నమోదవడం ఇది మూడోసారి.

1960లో 67.9 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదవగా.. 1968లో 42.7 మిల్లీమీటర్లు, 1972లో 83.2 మిల్లీమీటర్లు.. ప్రస్తుతం ఆగస్టులో 74.4 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. సాధారణంగా తెలంగాణలో 120 రోజులు వర్షాకాలం ఉంటుందని, 60-70 రోజులు మంచి వర్షాలు కురుస్తాయని.. మిగతా రోజుల్లో అడపదడపా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు.