నేడు ఇందూరులో ఐటీ టవర్‌ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

మొన్నటి దాకా ఐటీ సెక్టార్ అంటే కేవలం హైదరాబాద్ పేరు మాత్రమే వినిపించేది. కానీ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించాలన్న ఉద్దేశంతో పలు నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్స్ ను ఏర్పాటు చేసి.. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో ఐటీ టవర్స్ ప్రారంభించగా..నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అలాగే న్యాక్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11.15 గంటలకు నిజామాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లో ఆవరణలోని హెలిప్యాడ్‌లో దిగుతారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.