రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని, అప్రమత్తంగా ఉండాలిః కేంద్రం

కొత్త వేరియంట్స్ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా

Next 40 days crucial as India may see COVID cases surge in mid-January: Health Ministry sources

న్యూఢిల్లీః జనవరిలో భారతదేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత కరోనా వేవ్స్ ను పరిశీలిస్తే కొత్త వైరస్ వేరియంట్స్ తూర్పు ఆసియాను తాకిన 30-35 రోజుల తర్వాత భారత దేశంలో సమూహ వ్యాప్తి అయింది. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే ఈసారి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తక్కువగానే ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరోసారి కరోనా వేవ్స్ వచ్చినా.. మరణాలు, ఆసుపత్రిలో చేరడం చాలా తక్కువగా ఉంటుందని వారు తెలిపారు.

మరోవైపు గత రెండు రోజుల్లో భారత్ వచ్చిన ఆరు వేల మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో 39 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో చైనాను వణకిస్తున్న కరోనా కొత్త వేవ్ భారత్ లోకి ప్రవేశించబోతుందన్న అనుమానాలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఢిల్లీలోని విమానాశ్రయాన్ని సందర్శించి, అక్కడ పరీక్షలు, స్క్రీనింగ్ సౌకర్యాలను పరిశీలించారు. శనివారం నుంచి ప్రతి అంతర్జాతీయ విమానంలో వచ్చే 2 శాతం మంది ప్రయాణికులకు ర్యాండమ్ కరోనా వైరస్ పరీక్షను తప్పనిసరి చేసింది.

చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, బ్యాంకాక్ , సింగపూర్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు వచ్చే వారం నుంచి ‘ఎయిర్ సువిధ’ ఫారమ్‌లను పూరించడంతోపాటు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసే అవకాశం కనిపిస్తోంది. చైనా, దక్షిణ కొరియా సహా కొన్ని దేశాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.

ఇదిలావుంచితే, కేసుల పెరుగుదలను ఎదుర్కోవడానికి దేశం సంసిద్ధతను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్య మంత్రి మాండవీయ సంబంధిత అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. కరోనా ఇన్‌ఫెక్షన్స్ అనూహ్యంగా పెరిగితే ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం భారతదేశంలోని ఆరోగ్య సదుపాయాల వద్ద మాక్ డ్రిల్‌లు జరిగాయి. ప్రపంచంలో కేసులు పెరుగుతున్నందున దేశం అప్రమత్తంగా, సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కోరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/