టాలీవుడ్ లో మరో విషాదం : వల్లభనేని జనార్దన్ మృతి

టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. వారంలో ఒకరు , ఇద్దరు మరణిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా కైకాల, చలపతి రావు మరణించగా..తాజాగా సీనియర్ నటుడు వల్లభనేని జనార్దన్ కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వల్లభనేని జనార్దన్..ఈరోజు ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం అందుతోంది. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఎస్పీ పాత్రలో జనార్దన్ నటించాడు.

విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్ధన్ పెళ్లిచేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత. చిన్నతనంలోనే మరణించగా.. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్.. ఇక అబ్బాయి అవినాశ్ అమెరిగాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. జనార్ధన్ మృతితో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. వల్లభనేని జనార్ధన్ 1959 సెప్టెంబర్ 25న ఏలూరు దగ్గర పోతునూరులో జన్మించారు. ఆయనకు మొదటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఎక్కువగా. విజయవాడలోని లయోలా కాలేజీలో చదువుపూర్తిచేసిన ఆయన.. సినిమాపై ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మామ్మగారి మనవలు అనే సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కన్నడలో హిట్ అయిన మానససరోవర్ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి సినిమాకు దర్శకత్వం వహించారు. శోభన్ బాబు హీరోగా తోడు నీడ చిత్రాన్ని నిర్మించారు.

తన కూతురు శ్వేత పేరు మీద శ్వేత ఇంటర్నేషన్ సంస్థను స్థాపించి శ్రీమితి కావాలి, పారిపోయిన ఖైదీలు చిత్రాలను రూపొందించారు. తన మామ విజయబాపినీడుతో కలిసి మహాజనానికి మరదలు పిల్ల చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన సూపర్ హిట్ గ్యాంగ్ లీడర్ మూవీలో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్ధన్ నటనకు ప్రశంసలు అందుకున్నారు.