మంత్రి కేటీఆర్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది

మంత్రి కేటీఆర్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. కేటీఆర్ బుధువారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్‌, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం నర్సంపేటలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్మించిన ఎన్పీజీ గ్యాస్ ప్రాజెక్టును ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. కాగా మరికాసేపట్లో వరంగ‌ల్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ బ‌హిరంగ స‌భ‌కు కేటీఆర్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. బ‌హిరంగ స‌భ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాయి.

వ‌రంగ‌ల్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం గాలి దుమారం రేగింది. ఈ ప్ర‌భావంతో కేటీఆర్ బ‌హిరంగ స‌భ టెంట్లు కూలిపోయాయి. అయితే కేటీఆర్ స‌భ‌కు హాజ‌రు కాక‌ముందే ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. స‌భ ప్రారంభ‌మ‌య్యాక ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉంటే… కేటీఆర్ స‌హా చాలా మంది నేత‌లు, భారీ సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌ల‌పై స‌ద‌రు టెంట్లు కూలి ఉండేవి. అయితే ఈ ప్ర‌మాదం స‌భ ప్రారంభం కావ‌డానికి ముందే జ‌ర‌గడంతో పెను ప్ర‌మాదమే తప్పిందని అంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు టెంట్లు వేసే పనిలో ఉన్నారు.