అమిత్ షా ను కలిసిన నారా లోకేష్
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ చర్యలను వివరించిన లోకేష్

New Delhi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం రాత్రి న్యూ ఢిల్లీ లో కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని జగన్ కక్ష సాధింపు చర్యలకు గురిచేస్తున్నారని లోకేష్ తెలిపారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని అమిత్ షా లోకేష్ ను అడిగితెలుసుకున్నారు.
కక్ష సాధింపు తో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి లోకేష్ అమిత్ షా కు వివరించారు.
73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా లోకేష్ తో అన్నారని తెలిసింది. అదేవిధంగా , చంద్రబాబు ఆరోగ్య విషయాలను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లోకేష్ ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/