గవర్నర్‌ తో ముగిసిన జగన్ భేటీ..రేపు మంత్రుల రాజీనామా

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరుగగా.. మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును జగన్‌ గవర్నర్‌కి వివరించారు. ఈ నెల 11న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు.

కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే వారి గురించి గవర్నర్‌కు వివరించిన సీఎం.. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని తీసుకునేందుకు కారణాలను వివరించారు. ఈ నెల 11న కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల గురించి కూడా సీఎం జగన్‌ గవర్నర్‌కు వివరించారు. గత వారం రోజులుగా సొంత రాష్ట్రం ఒరిస్సా, ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 3 గంటలకి క్యాబినెట్‌ సమావేశం కానుంది.