నేడు సామర్లకోటలో సీఎం జగన్ పర్యటన..

ఏపీ సీఎం జగన్ నేడు సామర్లకోటలో పర్యటించబోతున్నారు. సొంతింటి కలను ఏపీ ప్రజలకు జగన్ అందించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 2 వేలకు పైగా ఇళ్లల్లో గృహప్రవేశాలు జరుగనున్నాయి. అనంతరం అక్కడి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

బుధవారం రాత్రి సామర్లకోటలో కాలనీ గృహాలను రాష్ట్ర హౌసింగ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్‌, హౌసింగ్‌ జేఎండీ శివప్రసాద్‌, కలెక్టర్‌ కృతికాశుక్లా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు సంబంధించిన ట్రైల్‌ రన్‌ను హెలీప్యాడ్‌ నుంచి ఈటీసీ లేఅవుట్‌ వరకూ నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి వివరాలను విలేకరులకు కలెక్టర్‌ వివరించారు.

సీఎం జగన్ గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సామర్లకోట చేరుకోనున్నారు. అక్కడ జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం జగన్.. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి సిఎం జగన్ చేరుకోనున్నారు.