భారత్ లోని ముస్లింల హక్కులపై యూఎస్ మీడియా ప్రశ్న.. బదులిచ్చిన మోడీ

భారత్ లో మత, కుల, జాతి వివక్ష లేనేలేదని స్పష్టీకరణ

modi-answer-to-us-media-question-on-minority-rights-in-india

వాషింగ్టన్ః భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. మరోవైపు వైట్ హౌస్ లో అమెరికా మీడియాతో మోడీ సమావేశం సందర్భంగా… ప్రజస్వామ్యం, మైనార్టీల హక్కులు, ఇండియాలో వాక్ స్వాతంత్ర్య హక్కు వంటి అంశాలపై మోడీకి ప్రశ్నలు ఎదురయ్యారు.

ఇండియాలో ముస్లింల హక్కుల గురించి ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… మీ ప్రశ్న తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మోడీ చెప్పారు. తమది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, తమ రక్తంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తే ఊపిరిగా తాము జీవిస్తామని చెప్పారు. భారతదేశ రాజ్యాంగంలో ఉన్నదే ప్రజాస్వామ్యమని అన్నారు. మానవతా విలువలు, మానవ హక్కులు లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టేనని చెప్పారు. భారత్ లో మత, కుల, జాతి వివక్ష లేనేలేవని ప్రధాని స్పష్టం చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేది తమ విధానమని చెప్పారు. మతాలు, కులాలు, ప్రాంతాలు, వయసు భేదం లేకుండా అందరికీ అన్నీ సమానంగా అందుబాటులో ఉంటాయని చెప్పారు.