మహిళలకు క్షమాపణ చెప్పిన సిఎం నితీశ్‌ కుమార్‌

ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి

Bihar CM Nitish Kumar apologises for comment on women after row erupts

పాట్నాః బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు క్షమాపణ చెప్పారు. అసెంబ్లీలో తన స్పీచ్ పై ఆయన బుధవారం మీడియా ముందు స్పందించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరినీ కించపరచాలని అనుకోలేదని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను చెప్పే క్రమంలో అలా మాట్లాడానని వివరించారు. ఏదేమైనా తన స్పీచ్ తో బాధపడిన మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

మరోవైపు ముఖ్యమంత్రి స్పీచ్ పై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) కూడా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. సీ గ్రేడ్ సినిమాల్లో వాడే భాషను ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉపయోగించారని విమర్శించారు. ముఖ్యమంత్రి నితీశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ స్పీచ్ పై ప్రతిపక్ష బిజెపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. నితీశ్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనపై నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల అభ్యంతరాలపై మీడియా ముందే వివరణ ఇచ్చినట్లు తెలిపారు. నితీశ్ కుమార్ స్పీచ్ చూసి ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని బిజెపి నేతలు విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాటలు విన్న వారందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితని మండిపడ్డారు. నితీశ్ మైండ్ పనిచేయడంలేదని, ఆయన స్టేట్ మెంట్ మరీ థర్డ్ గ్రేడ్ గా ఉందని విమర్శించారు.