అలా చేస్తే ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటాంః మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కీలక వ్యాఖ్య‌లు

minister-jagadish-reddy-hot-comments-on-munugode-by-poll

నల్లగొండః మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొరటికల్ గ్రామంలో నిర్వ‌హించిన ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి ప్ర‌ధాని మోడీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుల‌పై జ‌గ‌దీశ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మోడీ, అమిత్ షాల‌కు ఛాలెంజ్ చేస్తున్నాను. రాజ‌గోపాల్ రెడ్డికి అప్పనంగా క‌ట్ట‌బెట్టిన రూ. 18 వేల కోట్లు మునుగోడు, న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి ఇవ్వండి.. ఉప ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటామ‌ని జ‌గ‌దీశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ను ప్రాధేయ‌ప‌డైనా ఒప్పిస్తామ‌ని చెప్పారు.

రాజ‌కీయాల కోస‌మే ఉప ఎన్నిక‌లు సృష్టించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ‌డానికే ఈ కుట్ర‌లు, కుతంత్రాలు అని మండిప‌డ్డారు. స‌స్య‌శ్యామ‌లం అవుతున్న తెలంగాణ‌లో మంట‌లు సృష్టించేందుకు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. హిందూ మ‌తం గురించి వేదాలు వ‌ల్లించే బిజెపి ప్ర‌భుత్వం.. యాదాద్రి పున‌ర్ నిర్మాణానికి రూ. 100 కూడా చందా ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ రూ. 1000 కోట్ల‌తో యాదాద్రిని పున‌ర్ నిర్మించారు. మోడీ, అమిత్ షాలు మాత్రం రాజ‌గోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్లు అప్ప‌నంగా అప్ప‌గించార‌ని నిప్పులు చెరిగారు. హిందూ మతానికి అంబాసిడర్లు అంటూ ఇతర మతాల మీద విషం చిమ్మే బిజెపి యాదాద్రి పునర్ నిర్మాణానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/