బెంగళూరు వాసులకు మెగాస్టార్ సలహా

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత నీటి సంక్షోభం ఏర్పడింది. గుక్కెడు తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే.. అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. మరోవైపు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయకపోవడంతో.. ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. డిమాండ్‌ పెరగడంలో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు.

కోటిన్నర మంది జనాభా ఉన్న ఈ నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది నుంచి 145 కోట్ల లీటర్ల నీటిని తీసుకువస్తున్నారు. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న బెంగళూరుకు కావేరీ నీటితో పాటు మరో 60 కోట్ల లీటర్ల నీళ్లు నగరంలోని బోర్ల ద్వారా అందుతున్నాయి. నగరంలో నీటి సంక్షోభానికి భూగర్భ జలాలు పడిపోవడమే కారణం. 2023 వర్షాకాలంలో కూడా పెద్దగా వానలు పడలేదు.

బెంగళూరు చుట్టుపక్కల ఉన్న 110 గ్రామాలను నగరంలో కలపడం కూడా ఈ సమస్యకు మరో కారణం. దీనికి తోడు దక్షిణ బెంగళూరులోని కాలనీలు, బహుళ అంతస్తుల్లో నివసిస్తున్న ప్రజలు కొత్త జీవనశైలిని అలవాటు చేసుకున్నారు. దేశంలో చల్లగా ఉండే నగరాలలో ఒకటైన బెంగళూరులో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం, వేడి గాలులు వీయడంపై గతంలో వాతావరణ శాఖ ప్రకటన చేసినప్పటి నుంచి నీటి సమస్య పెరగడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణపై కర్ణాటకవాసులకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో పలు సూచనలు చేశారు. ఇంకుడు గుంతలు, చిన్నచిన్న బావులు ఉండేలా ఇళ్లను నిర్మించుకోవాలని, అక్కడి తన ఫామ్ హౌస్లోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా.. ట్వీట్ మొత్తాన్ని ఆయన కన్నడ భాషలోనే చేయడం విశేషం.