కేసీఆర్ సొంత విమానం కొనేది దుబాయికో.. సింగపూర్ కో పారిపోవడానికే – రాజగోపాల్

మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల హడావిడి మొదలుకావడంతో అన్ని పార్టీల నేతలంతా నియోజకవర్గం లో ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఊరువాడా లో ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ మద్దతు కోరుతున్నారు. ఈరోజు ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి చండూర్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాజగోపాల్ మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకున్నారని , ఎన్నిసార్లు ఇక్కడి సమస్యలను లేవనెత్తినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యైనైనందుకు తనపై కక్షసాధింపుకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా కేసీఆర్ అణగదొక్కుతున్నారని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలో ఏ సీఎం పాల్పడనంతా అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సొమ్మును మోడీ, అమిత్ షా కక్కిస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రూ.100 కోట్లు పెట్టి సొంత విమానం కొనేది దుబాయికో.. సింగపూర్ కో పారిపోవడానికేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

మరోవైపు మునుగోడు ప్రచారానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 17నుంచి బండి సంజయ్ ప్రచారం చేస్తారని బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తెలిపారు.