చంద్రబాబును కక్ష కట్టి వ్యవస్థల్ని మెనేజ్ చేసి జైలుకు పంపారు – నారా లోకేష్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ను రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. గత 28 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు ఆయనతో ములాఖత్ అవుతూ వస్తున్నారు. ఈరోజు చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా లోకేష్ , భువనేశ్వరి , బ్రహ్మణి లు ములాఖత్ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియా తో మాట్లాడుతూ జగన్ ఫై పలు విమర్శలు , ఆరోపణలు చేసారు.

చంద్రబాబును కక్ష కట్టి వ్యవస్థల్ని మెనేజ్ చేసి జైలుకు పంపారని లోకేష్ ఆరోపించారు.గత 28 రోజులుగా జ్యూడిషియల్ రిమాండ్ లో చంద్రబాబు ఉన్నారు. ఇసుక, మద్యం, మట్టి, మాఫియాలపై నిలదీసినందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆరోపించారు. జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు భద్రతపై మాకు సందేహాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. జైల్లో నక్సలైట్లు, గంజాయి అమ్మేవారు, క్రిమినల్స్ కూడా ఉండడంతో ఆయన భద్రతపై చాల భయంగా ఉందంటూ లోకేష్ ఆరోపించారు. ఇంకా కొందరు జైలుపై దాడి చేస్తామని కూడా SP కి లేఖ రాశారంటూ లోకేష్ మీడియా తో అన్నారు.

న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ, తమ వైపే ఉంటుందని లోకేశ్‌ అన్నారు. చంద్రబాబు ఏనాడూ తప్పు చేయరు. రిమాండ్‌లో ఉంచినా ఆయన అధైర్య పడలేదు. పోరాటం ఆపవద్దు.. శాంతియుతంగా పోరాడాలని మాతో చెప్పారు. న్యాయం గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. న్యాయపోరాటం కొనసాగిస్తాం. శనివారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, మొబైల్‌ ఫ్లాష్‌లైట్లతో సంఘీభావం తెలపాలి. మా కుటుంబం మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చింది. మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడుతాం అని లోకేశ్‌ తెలిపారు.