ఏపీకి రూ.879 కోట్లను విడుదల చేసిన కేంద్రం

ఏపీ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల కింద ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్రం ఏపీకి రూ.879 కోట్లను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూపంలో రూ.7032.67 కోట్లు విడుదల చేశామని కేంద్రం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 8వ వాయిదా కింద ఏపీతో సహా లోటును ఎదుర్కొంటున్న 14 రాష్ట్రాలకు కలిపి రూ.7183.42 కోట్లను విడుదల చేశామని కేంద్రం పేర్కొంది.

రూ.7183.42 కోట్లలో ఏపీ, అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లకు విడుదల చేశారు. ఇప్పటి వరకు (2022-23) రాష్ట్రాలకు రూ.. 57,467.33 కోట్లు విడుదల చేశారు. రెవెన్యూ లోటు కింద నిధులు విడుదల చేయడం ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కు రూ.1,132 కోట్లు విడుదలయ్యాయి.