అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అద్వానీ!

LK Advani will attend Ram Mandir inauguration on Jan 22: VHP leader

అయోధ్య: జనవరి 22న ప్రధాని మోడీ సమక్షంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బిజెపి కురువృద్ధుడు, సీనియర్ నేత అద్వానీ హాజరుకానున్నట్లు వీహెచ్‌పీ ఓ ప్రకటనలో తెలిపింది. అయోధ్య రామాలయం అంశం ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి.

అయితే వయోకారణాల దృష్యా వారిద్దరిని ఈ వేడుకకు రావద్దని చెప్పడం రామజన్మభూమి క్షేత్ర ట్రస్టు చెప్పడం పెద్ద దుమారం రేపింది. దీంతో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 96 ఏండ్ల అద్వానీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని వీహెచ్ పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు.

ఆయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఈ నెల 16 నాటికి పూర్తికానున్నాయి. అదే రోజునుంచి ఆలయంలో మూల విరాట్‌ల ప్రాణ ప్రతిష్ఠ పూజలు ప్రారంభం అవుతాయి. అనంతరం జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దలైలామా, మాతా అమృతానందమయి, యోగా గురువు బాబా రాందేవ్‌, సినీ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, మాధురీ దీక్షిత్‌, అరుణ్‌ గోవిల్‌, ప్రభాస్‌, దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్‌ అంబానీతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆలయ ట్రస్టు ఆహ్వానించింది.