మళ్లీ టిఆర్‌ఎస్‌గా మారనున్న బిఆర్‌ఎస్‌..కెటిఆర్‌కు కడియం సూచన

పేరులోంచి తెలంగాణను తొలగించడం వల్ల ప్రజలకు దూరమైందన్న భావన

brs-will-change-its-name-back-to-trs

హైదరాబాద్‌ః జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)గా మార్చి తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ తిరిగి టిఆర్ఎస్‌గా మారబోతోందా? బిఆర్ఎస్ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లి బొక్కబోర్లా పడిన పార్టీ తిరిగి పూర్వపేరుకు వెళ్లడం ద్వారా ప్రజలకు తిరిగి దగ్గరవ్వాలని భావిస్తోందా? ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి వ్యాఖ్యలు చూస్తుంటే అవననే అనిపిస్తోంది.

నిన్న తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ సమక్షంలో కడియం ఈ విషయానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బిఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ఒకటిరెండు శాతంమంది ప్రజలు అలా భావించి దూరమై ఉంటారని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

అంతేకాదు, ఎక్కువమంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కడియం చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే ఆ విషయాన్ని ఎంపీ వినోద్‌కుమార్‌కు విడిచిపెట్టాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధినేత కెసిఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లి చర్చించాలని కడియం సూచించినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.