మోటార్ల బిగింపు, నిర్వహణల పేరుతో భారీగా దోపిడీ: టిడిపి నేత జీవీ రెడ్డి

ఒక్కో మీటర్ బిగింపు, నిర్వహణకు రూ.12 వేలు ఖర్చా?

tdp-national-spokesperson-gv-reddy-press-meet

అమరావతిః స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో వైఎస్‌ఆర్‌సిపి సర్కారు గోల్ మాల్ చేస్తోందని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆరోపించారు. మోటార్ల బిగింపు, నిర్వహణల పేరుతో భారీగా దోపిడీకి తెగబడుతోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో ఒక్కో మీటర్ బిగింపు, నిర్వహణకు రూ.700 నుంచి రూ.800 లోపు ఖర్చవుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.12 వేలు ఖర్చవుతోందని చెబుతోందన్నారు. మోటార్లకు మీటర్ల పేరుతో రైతుల మెడలకు వైఎస్‌ఆర్‌సిపి సర్కారు ఉరితాళ్లు బిగిస్తోందని జగన్ సర్కారుపై జీవీ రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రాజెక్టు భద్రత, నిర్వహణ బాధ్యతలను కొన్నాళ్లపాటు ఆ ప్రాజెక్టు గుత్తేదారే చూసుకోవాల్సి ఉంటుందని జీవీ రెడ్డి గుర్తుచేశారు. స్మార్ట్ మోటార్ల బిగింపు విషయంలో మాత్రం జగన్ రెడ్డి తన బంధువు కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు లబ్ది కలిగేలా టెండర్ నిబంధనలు మార్చేశారని ఆరోపించారు. మోటార్ల బిగింపు, నిర్వహణలకు రైతుల నుంచే వసూలు చేస్తున్నారని, భవిష్యత్తులో ఉచిత విద్యుత్ కు కూడా జగన్ సర్కారు మంగళం పాడుతుందని చెప్పారు.

టెండర్లు పిలిచే సమయంలోనే ప్రభుత్వం అధిక ధరలు కోట్ చేసిందని, రూ.6,400 కోట్లుగా టెండర్ వ్యాల్యూను నిర్ధారించిందని జీవీ రెడ్డి ఆరోపించారు. షిర్డీసాయి సంస్థకోసమే ప్రభుత్వం రైతుల్ని దోచుకునేలా విధానాలు రూపొందించిందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ టెండర్ లో దాదాపు రూ.5 వేల కోట్లు కిక్ బ్యాక్ ద్వారా తమకు అందేలా టెండర్ నిబంధనలను మార్చారని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.

పాలకుల దోపిడీకి డిస్కమ్ లు, విద్యుత్ తయారీ సంస్థలు ఇప్పటికే మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని మూడు డిస్కంలకు బాకీ పడిన రూ. 26 వేల కోట్లను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. మీటర్ల బిగింపులో మరింత నష్టం చూపి, మొత్తం డిస్కమ్ లనే ప్రైవేటు పరం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోందని జీవీ రెడ్డి ఆరోపించారు. మీటర్ల బిగింపులో రైతులను దోచుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రైతులు కూడా ప్రభుత్వం చెప్పే మాయమాటలకు లొంగిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి హితవు పలికారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/