నేడు కరీంనగర్‌ లో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

కరీంనగర్‌ లో మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి ని మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిపై దేశంలోనే తొలిసారిగా డైనమిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్‌ బ్రిడ్జి ఇది. మానేరు నదిపై కరీంనగర్‌ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్‌ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు.

నాలుగు వరుసలతో 500 మీటర్ల పొడవున నిర్మించిన బ్రిడ్జికి అవసరమైన కేబుల్‌ను ఇటలీ నుంచి తీసుకొచ్చారు. పాదచారుల కోసం రెండువైపులా కలిపి 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ నిర్మించారు. ఈ బ్రిడ్జిపై నుంచి చూస్తే.. ఒకవైపు మధ్యమానేరు జలాశయంతోపాటు రూ.410 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్‌ఫ్రంట్‌ వ్యూ మొత్తం కనిపించనుంది.

ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, సిరిసిల్ల తదితర జిల్లాల నుంచి కరీంనగర్‌ మానేరు వంతెన రహదారి మీదుగా వరంగల్‌, విజయవాడకు వెళ్లే వారికి ప్రయాణ భారం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా నగరంలో ట్రాఫిక్​ రద్ధీ కూడా తగ్గనుందని చెప్పారు. కేబుల్​ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే తీగల వంతెన 500 మీటర్లు, కరీంనగర్‌ కమాన్‌ నుంచి వంతెన వరకు 300 మీటర్లు, సదాశివపల్లి వైపు 500 మీటర్ల దూరంలో రహదారి పనులు పూర్తి కాగా.. మిగిలిన 3.4 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేసి అప్రోచ్‌ రోడ్లు నిర్మించారు.