ప్రధానికి..మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న

ప్రధాని మోడీ కి బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు. ‘‘ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీజీకి సూటి ప్రశ్న. మే 2014లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ ధర రూ.71 ఉండేది. అదే 2023 మార్చి నాటికి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 65 డాలర్లు మాత్రమే ఉంటే.. లీటర్ పెట్రోల్ ధర రూ.110కి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే.. ఇంధన ధరలు పెంచారు. మరి క్రూడ్ ధరలు తగ్గితే ఇంధన ధరలు ఎందుకు తగ్గించలేదు?’’ అని ప్రశ్నించారు. ‘ఈ పెంపుతో ఎవరికి ప్రయోజనం..?’ అంటూ మరో ప్రశ్న వేశారు. అదేవిధంగా 2014, 2023 సంవత్సరాల్లో క్రూడాయిల్‌, ఇంధన ధరల హెచ్చుతగ్గులను పోల్చిచూపుతున్న కొన్ని గ్రాఫ్‌లను కేటీఆర్‌ తన ట్వీట్‌కు జతచేశారు.

‘ఇంధన ధరలు తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొందరు అంటున్నారు. ఎల్ పీజీ ఇప్పటికే జీఎస్టీ పరిధిలో ఉంది. కానీ 8 ఏళ్లలో రూ.400 నుంచి రూ.1,200కి పెరిగింది’’ అని చెప్పుకొచ్చారు. జీఎస్టీలో ఉన్న ఎల్ పీజీ సిలిండర్ ధరలు తగ్గించని ప్రభుత్వం.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను మాత్రం తగ్గిస్తుందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు.