మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫై ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్

దేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈరోజు బుధువారం తొర్రూరులో మహిళా దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20వేల మంది మహిళలతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కేంద్రం ఏ అవార్డులు ప్రకటించినా ఎర్రబెల్లి నాయకత్వం వహిస్తున్న శాఖకు రావడం గర్వకారణమన్నారు. మంత్రి కృషి, అధికారులు పనితీరు వల్లే ఇలాంటి గుర్తింపు లభించిందని అభినందించారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి పాఠాలు నేర్పిస్తుందని చెప్పారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

త్రీస్టార్‌, ఫోర్‌స్టార్‌ పేరుతో జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్స్‌, రేటింగ్స్‌ వచ్చాయి. పంచాయతీరాజ్‌ శాఖతోనే ర్యాకులు వస్తాయి. త్రీస్టార్‌, ఫోర్‌స్టార్‌లో ఒకటి నుంచి ఆరు ర్యాంకులకు అవార్డులు ఇస్తే.. ఇందులో నాలుగు జిల్లాలు తెలంగాణావే ఉన్నయ్‌. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో పంచాయతీరాజ్‌ శాఖ అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నది. గ్రామస్థాయి వార్డు సభ్యుడు, కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అందరూ సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు పని చేస్తున్నందుకే అవార్డులు వస్తున్నయ్‌’ అని కేటీఆర్ అన్నారు.