చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని..టీడీపీ అధినేత చంద్రబాబు కు సవాల్ విసిరారు. గుడివాడలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి ఒక్క ఎకరా భూమి అయినా కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు నాని. గుడివాడలో చంద్రబాబు కామెంట్స్‌ మీద మండిపడ్డ నాని.. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు గుడివాడకు చేసిందేంటని ప్రశ్నించారు. మచిలీపట్నంలో షిప్‌యార్డు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంటే అడ్డుపడే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం గుడివాడ లో చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. స్థానిక వైస్సార్సీపీ ఎమ్మెల్యే..కొడాలి నాని పై ఫైర్ అయ్యారు. గుడివాడలో రాజకీయ బిక్ష పెడితే..చరిత్ర హీనులుగా మారారన్నారు. ఎన్టీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడని చంద్రబాబు గుర్తు చేసారు. అలాంటి చోట ఈ రోజు తులసి వనంలో గంజాయి మొక్కలా స్థానిక ఎమ్మెల్యే తయారయ్యాడని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆ మొక్కను పెకిలించేద్దామని పిలుపునిచ్చారు. బూతులు మాట్లాడటం గొప్పతనమా అని ప్రశ్నించారు. అవి మాట్లాడటానికి తాను అవసరం లేదని,తమ్ముళ్లను రెచ్చగొడితే ఆ బూతులు వినలేని పరిస్థితి తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రతీ ఒక్కరూ జెండా పట్టుకుని రోడ్డుపైకి వస్తే ఈ బూతుల మాజీ మంత్రి రోడ్డుపై తిరగగలడా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సరైన రోడ్డు వేయలేని ఈ ఎమ్మెల్యే కేబరే డాన్సులు తెచ్చారంటూ ఆరోపించారు. పేకాట క్లబ్బులు తెచ్చి బాగా దండుకున్నారని విమర్శించారు. మధ్య తరగతి ప్రజలకు చెందిన ప్లాట్లు కబ్జా చేసారని ఆరోపించారు.

ఈ ఆరోపణలఫై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశారు. ఇప్పుడు సిగ్గులేకుండా వచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం గుడివాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గుడివాడకు చంద్రబాబు ఏం చేశారు? గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయింది. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపించగలరా?. చంద్రబాబు నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు జిత్తులమారి నక్క’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు.

‘‘సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారు. ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేదు. మేము పెట్టిన విగ్రహలకు చంద్రబాబు దండలు వేశారు. హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు నిమ్మకూరును అభివృద్ధి చేశారు. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉన్న చిత్తుశుద్ధి చంద్రబాబుకు లేదు. నిమ్మకూరును ఉద్దరించామని చెబితే ఎవరు నమ్ముతారు?’’ అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు.