కేటీఆర్‌తో సెల్ఫీల కోసం పోటీపడ్డ మహిళలు..

సినీ హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో..అంతకు మించి మంత్రి కేటీఆర్ కు క్రేజ్ ఉంది. కేటీఆర్ జనాల మధ్యకు వస్తే చాలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడతారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అదే జరిగింది. కేటీఆర్ తో సెల్ఫీ దిగాలంటే రూ. 500 చెల్లించాల్సిందే అని అన్నప్పటికీ ఓ..అంటూ మహిళలు పోటీపడ్డారు.

ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో కాలినడకన తిరుగుతూ.. అందరిని పలకరిస్తూ వెళ్తున్న క్రమంలో కేటీఆర్‌తో మహిళలు పెద్ద ఎత్తున సెల్ఫీలు తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఓ మహిళతో సెల్ఫీకి రూ.500 అవుతుంది.. అని సరదాగా అన్నారు. దానికి ఆ మహిళా.. అయినా పర్లేదు అంటూ సెల్ఫీ తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు తీసుకురావటం కేసీఆర్ లాంటి నాయ‌కుడితోనే సాధ్యమ‌వుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిదేండ్లలో అన్ని ర‌కాల కార్యక్రమాలు అద్భుతంగా జ‌రిగాయన్నారు. ప్రభుత్వం అమ‌లు చేస్తోన్న కార్యక్రమాలు నిరంత‌రం, నిర్విఘ్నంగా సాగాలంటే కేసీఆర్ లాంటి నాయకుడుంటేనే అమ‌ల‌వుతాయన్నారు.

తెలంగాణ ద‌ళిత‌ బంధు అనే కార్య‌క్ర‌మం కింద ఇద్ద‌రు సోద‌రులు క‌లిసి రూ. 25 ల‌క్ష‌ల‌తో ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ ఫాం ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు కేటీఆర్. పోయిన‌వారం ఎల్లారెడ్డిపేట‌లో ద‌ళిత‌బంధు ప‌థ‌కం కింద రైస్ మిల్లును ప్రారంభించాం. ప‌దిరె గ్రామంలో 9 మంది క‌లిసి 90 ల‌క్ష‌ల‌తో పెట్రోల్ బంక్ పెట్టుకున్నార‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. దాన్ని కూడా అంబేద్క‌ర్ జ‌యంతి త‌ర్వాత ప్రారంభించుకుంటామ‌ని తెలిపారు. గండిల‌చ్చపేట‌లో ద‌ళిత బంధు కింద 30 కుటుంబాలు వ్యాపారాలు మొద‌లు పెట్టాయి. ఆర్థికంగా ఎదుగుతున్నందుకు గండిలచ్చ‌పేట ద‌ళితులంద‌రికీ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెల‌పుతున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.