తెలంగాణలో కొత్తగా బ్రూ ట్యాక్స్ – కేటీఆర్

రాష్ట్రంలో కొత్తగా బ్రూ ట్యాక్స్ మొదలైందని కేటీఆర్ అన్నారు. భట్టి ట్యాక్స్(B), రేవంత్ ట్యాక్స్ (R), ఉత్తమ్ ట్యాక్స్(U).. ఇలా మూడు రకాల ట్యాక్స్ల లు సామంత రాజులు ఢిల్లీకి కప్పం పంపాలి కాబట్టి.. కొత్తగా ఈ ట్యాక్స్లు మొదలుపెట్టారన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని 420 రేవంత్‌ రెడ్డి అని ధ్వజమెత్తారు.

ఆరు గ్యారెంటీల్లో ఒక్క హామీ అమలు చేసి, ఐదు చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఫ్రీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు, టికెట్ల కోసం పురుషులు కొట్లాడుకుంటున్నారని చెప్పారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు రుణమాఫీ ఊసేలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో దొడ్డు బియ్యానికి బోనస్‌ అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడ్డాక సన్న వడ్లకే అని మాట మార్చారని మండిపడ్డారు. 95శాతం రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని, సన్న బియ్యానికే బోనస్‌ అని బోగస్‌ మాటలు చెబుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్‌ కూడా వేయలేదన్నారు.

మహాలక్ష్మీ పథకం తెలంగాణలో అమలవుతున్నదని రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని విమర్శించారు. 420 హామీలు ఇచ్చిన హస్తం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు.