ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితేనే కాంగ్రెస్ కు కనువిప్పు – హరీశ్ రావు

కాంగ్రెస్ నేతలు ఇంకెంత కాలం కేసీఆర్ను తిట్టుకుంటూ బతుకుతారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే నీళ్లు, కరెంట్ మాయమయ్యాయని ఆరోపించారు. ‘త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిస్తే తప్ప కాంగ్రెస్కు కనువిప్పు రాదు. ఆ పార్టీకి ఓటేయడమంటే వారి అబద్ధాలను ఆమోదించడమే. రాష్ట్రమంతా పంటలు ఎండిపోయాయి. క్రాప్ హాలిడే నెలకొంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మధిర నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అందర్నీ మోసం చేసిందని.. ఆరు నెలల్లోనే నిజస్వరూపం బయటపడిందని హరీశ్‌రావు అన్నారు. ఆరు నెలలు అయినా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని అన్నారు. నిరుద్యోగ భృతి విషయంలో చేతులెత్తేశారని అన్నారు. నిరుద్యోగ భృతి గురించి అడిగితే మేం హామీనే ఇవ్వలేదని కాంగ్రెస్‌ అంటుందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక నీళ్లు, కరెంట్‌ మాయమయ్యాయని.. కేసీఆర్‌ కిట్లు బంద్‌ అయ్యాయని హరీశ్‌రావు అన్నారు. ఇంకెన్ని రోజులు కేసీఆర్‌ను తిట్టుకుంటూ కాంగ్రెస్‌ నేతలు బతుకుతారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓడిస్తేనే కాంగ్రెస్‌కు కనువిప్పు కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే.. కాంగ్రెస్‌ అబద్ధాలను ఆమోదించడమే అని స్పష్టం చేశారు.