వృద్ధుడి దగ్గర పిప్పర్‌మెంట్లు కొనుగోలు చేసిన కేటీఆర్

కేటీఆర్ మాటలే కాదు చేతలు సైతం అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ లో ఇదే జరిగింది. శనివారం జలవిహార్‌లో తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్… ఓ పెద్దాయన వద్ద పిప్పర్‌మెంట్లు కొని అందరినీ ఆశ్చర్యపరిచారు. పిప్లర్‌మెంట్లు అమ్ముకునే ఆ వృద్ధుడి పేరు సత్యనారాయణ. హైదరాబాద్‌లో ఇలాంటి సమావేశాలు ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోతుంటాడు. అక్కడ పిప్పర్‌మెంట్లు, చాక్లెట్లు అమ్ముకుని జీవిస్తూ ఉంటాడు. అలాగే, శనివారం న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి కూడా వచ్చాడు.

కేటీఆర్‌ను చూసి సరదాగా సైగ చేసి పిప్పర్‌మెంట్లుతీసుకోవాలని కోరాడు. వెంటనే కేటీఆర్ ఆయనను దగ్గరికి పిలిచి , అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి స్వయంగా తనను పిలిచి పలకరించడంతో ‘నేను మీకు తెలుసా సార్’ అని ఆశ్చర్యం, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ప్రశ్నించాడా వృద్ధుడు. మీరిలా పిప్పర్‌మెంట్లు అమ్ముతుండగా ఇది వరకు చూశానని మంత్రి బదులిచ్చారు. అనంతరం ఆ వృద్ధుడి వివరాలు తెసుకుని చెప్పాలంటూ సిబ్బందికి పురమాయించారు. తాను ఒంటరివాడినని, పాతబస్తీలో ఉంటానని, తనకు ఇల్లులేదని సత్యనారాయణ తెలిపారు. ఇలా తిరగడం కష్టంగా ఉందని చిన్న షాపు పెట్టుకోవడానికి తనకు సాయం చేయాలని కోరాడు.