కేటీఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ లో కరెంట్ మంటలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు నిరసనలు , ఆందోళనలు చేపడుతుంటే..కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనలు చేపడుతున్నారు. ఈ తరుణంలో నేడు భువనగిరి మండలం బండ సోమరం విద్యుత్ సబ్ స్టేషన్ ని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు. సబ్ స్టేషన్ కరెంట్ సప్లై రిజిస్టర్ తనిఖీ చేసి సబ్ స్టేషన్ ఆపరేటర్ తో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంటు అనేది పచ్చి అబద్ధమని ఆరోపించారు. 11 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు.

24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ 12 నుంచి 13 గంటలకు మించి సరఫరా జరగటం లేదన్నారు. మధ్య మధ్యలో కరెంటు కోతలు మినహాయిస్తే.. 12 గంటల విద్యుతే రైతులకు అందుతుందన్నారు. “రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తా. నా సవాల్‌ను మంత్రి కేటీఆర్ స్వీకరించాలి. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడైనా సరే సబ్ స్టేషన్‌ కు వెళ్లి అక్కడ లాక్ బుక్కుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్‌ పార్టీకి సేవ చేస్తా. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని రుజువు చేస్తే సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తా. మూడు గంటలు కావాలా ? మూడు పంటల కావాలన్న వ్యక్తిని చెప్పుతో కొట్టాలి. ఒక్కొ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెయ్యి కోట్లు తిని.. తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారు. ఎవడోస్తారో రండి, కనీసం ఆరు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారని చూపించండి. కాంగ్రెస్ చేపట్టిన సత్యగ్రహ దీక్షను భగ్నం చేయడానికి బీఆర్ఎస్ నేతలు ఉచిత కరెంట్ పేరుతో కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ లేని విషయాన్ని ఉన్నట్టుగా అపోహలు సృష్టిస్తుంది. రేవంత్ రెడ్డి అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు” అని వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.