కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదం : 12 మంది బిజెపి ఎంపీ కుటుంబ సభ్యులు మృతి

గుజరాత్‌ మోర్బీలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన లో బిజెపి ఎంపీకి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు. మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించిన తీగల వంతెన ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది వరకు ఉన్నారు. ప్రమాదం జరిగాక కొందరు నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకోగా, మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారి కోసం బోట్ల సాయంతో గాలిస్తున్నారు.

ఇప్పటి వరకు 141 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరణించిన వారిలో బిజెపి ఎంపీకి చెందిన 12 మంది ఉన్నారు. రాజ్‌కోట్‌ బీజేపీ ఎంపీ అయిన మోహన్‌భాయ్‌ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతిచెందారు. వారంతా తన సోదరి కుటుంబానికి చెందినవారని కుందరియా చెప్పారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారన్నారు.

ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బ్రిజేష్ మెర్జా ప్రకటించారు. ప్రమాదం నేపథ్యంలో గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు.