ఏపీలో మళ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..ఈసారి ఎక్కడెక్కడ అంటే

ఏపీలో మరోసారి ఎన్నికల మోత మోగింది. మొన్ననే బద్వేల్ ఉప ఎన్నిక పూర్తి కాగా..ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల మున్సిపల్ ఎన్నికలపై ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

ఈ నెల 14,15,16 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నికలు జరగని ప్రాంతాలతో పాటుగా..గెలిచిన అభ్యర్ధులు మరణించిన మున్సిపల్ – పంచాయితీ..జెడ్పీటీసీ-ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలకు 14న పోలింగ్.. అదే రోజు ఫలితాలు విడుదలకానున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ నెల 15న ఎన్నికలు.. 17న కౌంటింగ్ ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్.. 18న కౌంటింగ్ ఉంటుంది. కోర్టు కేసులు, మరికొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు.

చంద్రబాబు ఇప్పటికే రెండు రోజులు పాటు కుప్పంలో పర్యటించారు. అక్కడ ఎలాగైనా మున్సిపాల్టీ వైసీపీకి వెళ్లకుండా చూసేందుకు కసరత్తు చేసారు. స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశం చేసారు. అదే విధంగా పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి..గురజాల ఎన్నికలు సైతం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఆసక్తి కరంగా మారుతోంది. ఈ ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి రానుంది. ఇక, రేపు బద్వేలు బై పోల్ ఫలితాలు వెల్లడైన తరువాత ఈ ఎన్నికల పైన రాజకీయంగా ఆసక్తి పెరిగే అవకాశం కనిపిస్తోంది.