బొత్స వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ మంత్రులు

మరోసారి ఏపీ , తెలంగాణ మధ్య వార్ మొదలైంది. తెలంగాణలో పరీక్షలు జరుగుతున్న విధానంపై ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఫై తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరుగున్న ఇంజినీరింగ్ ప్రవేశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందిస్తూ..తెలంగాణలో పరీక్షలు నిర్వహణ సరిగా లేదని , తెలంగాణ అడ్మిషన్ల సంగతి రోజూ పేపర్లో చూస్తున్నామన్నారు. ఆఫ్ర్టాల్‌ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఎలా జరిగాయో చూస్తున్నామంటూ విమర్సలు చేశారు. ఎంత చూచిరాతలు, ఎన్ని స్కామ్‌లు, ఎంతమంది అరెస్టు అయ్యారో తెలుస్తూనే ఉందన్నారు.

అలాగే తెలంగాణలో ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలపై కూడా బొత్స కామెంట్స్ చేశారు. టీచర్స్‌ ట్రాన్సఫర్సే తెలంగాణ వాళ్లు చేసుకోలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రాన్ని కంపేర్‌ చేయొద్దని మీడియాకు సూచించారు. ఎవరి విధానం వారికి ఉంటుందన్నారు. ఈ కామెంట్స్ ఫై తెలంగాణ మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. ముందు తమ రాష్ట్రం సంగతి చూసుకోవాలని.. అక్కడ చేసిన నిర్వాకాలు చాలవా అని ప్రశ్నిస్తున్నారు.

ఏ రాష్ట్రం ఎంత అభివృద్ది చెందుతుందో ప్రజలకు తెలుసునని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బొత్స మాట్లాడినందుకు తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని.. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని విమర్శలు గుప్పించారు. రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితి అని అన్నారు. వారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. నెలకొకసారైనా హైదరాబాద్‌కు రాకుంటే ఆయన ప్రాణం ఊరుకోదని అన్నారు. అలాంటిది హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలపై డౌట్‌ ఉందని డయల్ 100‌కు ఫోన్ వస్తే.. ఎంక్వైరీ చేసి.. పాతళంలోకి వెళ్లి లీకేజ్‌ను పట్టుకున్నామని చెప్పారు. స్కామ్‌తో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేశామని.. ఇందుకు అభినందించాల్సి ఉందన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. బొత్స సత్యనారాయణ బాధ్యతయుతమైన వ్యక్తిగా మాట్లాడలేదని అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్పత్రులు కట్టుకున్నారనేది అందరికి తెలుసునని అన్నారు. అక్కడివారికి అనారోగ్యం వస్తే చికిత్స కోసం ఎక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ విద్యావ్యవస్థలో కేరళను మించిపోయిందని మరో మంత్రి గంగుల అన్నారు. టీఎస్పీఎస్సీలో స్కామ్ ను బయటపెట్టిందని తమ ప్రభుత్వమేనన్న ఆయన తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు.ఏపీకి ఒక్కటైనా అవార్డు వచ్చిందా అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై బొత్స స్పందించాలన్నారు.స్పందించిన తరువాతే బొత్స హైదరాబాద్ లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.