పెట్రో ధరలను ఎక్కడైనా ముఖ్యమంత్రి తగ్గిస్తాడా?

స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు..: కొడాలి నాని

అమరావతి: మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబుకు వయసు పెరుగుతున్నా బుద్ధి మాత్రం పెరగడం లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ టీడీపీ ధర్నాలు చేపట్టిన నేపథ్యంలో కొడాలి నాని స్పందిస్తూ… చంద్రబాబు హయాంలో పెట్రోల్, డీజిల్ పై రూ. 2 సర్ ఛార్జి విధించారని చెప్పారు. పెట్రో ధరలను ఎక్కడైనా ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గు రావడం లేదని అన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ వారం రోజులు డెడ్ లైన్ విధించడంపై కొడాలి నాని మండిపడ్డారు. ఏడు రోజులు కాదు… ఏడేళ్లు డెడ్ లైన్ పెట్టినా పవన్ కల్యాణ్ ను జగన్ ఢిల్లీకి తీసుకెళ్లరని అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని… జనసేనతో పొత్తు పెట్టుకున్న ప్రధాని మోదీనని చెప్పారు. మోదీ, అమిత్ షాలు చంద్రబాబు, పవన్ లకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని… అందుకే అఖిలపక్షం పేరుతో ఢిల్లీకి తీసుకెళ్లాలని జగన్ ను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీని ఓటర్లు పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. గల్లీలో ఉన్న సిల్లీ బీజేపీ నాయకులు జగన్ ను ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/