యమునా నదిలో కాలుష్యం..నురగ నీటిలోనే పుణ్య స్నానాలు
నాలుగు రోజుల ఛత్ పూజా వేడుకలు నిన్న ప్రారంభం
chhath-devotees-stand-in-toxic-foam-laden-yamuna-river-in-delhi-to-offer-prayers
న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్యం ఎంతలా పెరిగిపోయిందో తెలిపడానికి ప్రత్యక్ష సాక్షాలివి. మంచు కొండల మధ్య మహిళలు నిలబడినట్లు, మంచుతో ఆడుకుంటున్నట్లు కనపడుతోన్న ఈ దృశ్యాల వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకుంటే ఆశ్చర్యానికి గురికావాల్సిందే. మంచులా కనపడుతోన్న ఈ తెల్లనిదంతా విషపు నురగ. నాలుగు రోజుల ఛత్‌పూజ వేడుకల్లో భాగంగా పుణ్యనదుల్లో ఒకటైన యమునా నదీలో భక్తులు పుణ్యస్నానమాచరిస్తారు. అయితే, కాలుష్యమయంగా యమునా నది మారడం, పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తుండంతో విషపు నురగలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. దీంతో భక్తులు ఆ విషపు నురగల మధ్యే పుణ్యస్నానాలాచరించాల్సి వస్తోంది. ఢిల్లీలోని కాళింది కుంజ్ లో నిన్న, ఈ రోజు మహిళలు పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. యమునా నదిలో ఎంత ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు ప్రవహిస్తున్నాయో తెలుసుకుని నదీమాతల్లిని ఆరాధించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ నీళ్లలో స్నానాలు చేస్తే అనేక రోగాలూ ప్రబలుతాయని అంటున్నారు. ఢిల్లీలోని కాళింది కుంజ్ లోని యమునా ఘాట్‌లో స్నానమాచరించిన ఓ మహిళ తాజాగా మీడియాతో మాట్లాడుతూ… యమునా నది మురికిమయం అయిపోయిందని తమకు తెలుసని, అందులో ప్రమాదకరస్థాయిలో విషపూరిత వ్యర్థాలు చేరాయని తెలిపింది. అయినప్పటికీ, సూర్య భగవానుడికి పూజలు చేయాలంటే అందులో పుణ్యస్నానాలు ఆచరించకతప్పదని చెప్పింది. కాగా, నదులను పరిరక్షించాలని, శుద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. కలుషిత నీటిలోనే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి రాకుండా ఆపాలని భక్తులు కోరుతున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/