విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష

తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో గురువారం విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ విద్యాశాఖ కు పలు ఆదేశాలు జారీ చేసారు.

ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100శాతం జీఈఆర్‌ సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాల‌ని, – ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్‌ ఉండాల‌ని సూచించారు. 2023 విద్యా సంవ‌త్స‌రంలో టెన్త్, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాల‌న్నారు.

ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్‌ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని తెలిపిన అధికారులు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు జరిగేలా బదిలీలు చేపడతామన్నారు. యూనిట్‌ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి.. వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు.

అలాగే నాడు – నేడు రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని అధికారులు వెల్లడించారు. 22,224 స్కూళ్లలో రెండోదశ నాడు – నేడు పనులు చేపడతామని , డిసెంబరు నాటికి పనులు పూర్తి అవుతాయని సీఎం కు అధికారులు తెలిపారు. నాడు–నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబులు పంపిణీతో పాటు, ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌ ఏర్పాటు పూర్తి చేయాలనీ సీఎం అన్నారు.

ఈ సందర్బంగా సీఎం జగన్ 2023–24 అకడమిక్‌ క్యాలెండర్‌ ను విడుదల చేసారు. ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను అధికారులు రూపొందించారు.