అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి పయనమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి

ఇప్పటికే ఢిల్లీకి రావాలంటూ ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు

kishan reddy
kishan-reddy-leaves-for-delhi-to-meet-with-party-top-leaders

న్యూఢిల్లీః తెలంగాణలో పార్టీ పరిస్థితులపై బిజెపి అధిష్ఠానం దృష్టిసారించింది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీ రావాలంటూ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో, హైదరబాద్‌లో నేటి కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని అధిష్ఠానం ఆదేశించింది.

కర్ణాటక ఫలితాల తరువాత తెలంగాణలో బీజేపీ దూకుడు కాస్తంత తగ్గిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ స్తబ్దతను తొలగించి రాబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేలా అదిష్ఠానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇక అసంతృప్త నేతలను బుజ్జగించే అంశంపై కూడా బిజెపి పెద్దలు దృష్టిసారిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీలకు వెళుతున్నారన్న వార్తల నేపథ్యంలో పార్టీ పెద్దలు రాష్ట్రంలోని కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకున్నారు. రాష్ట్రంలో బిజెపి నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలనేది అధిష్ఠానం ఆలోచనగా ఉన్నట్టు సమాచారం.