మందు బాబులకు బ్యాడ్ న్యూస్

మందు బాబులకు బ్యాడ్ న్యూస్. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి. ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలో వినాయక నిమజ్జనం ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే పోలీసులు ఆ రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా బార్లు, వైన్ షాపులు, బార్లతో ఉన్న రెస్టారెంట్లు తెరిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు.

ఇక గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి నిమర్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని చెప్పారు.

ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సర్కిల్, ప్యాట్నీ సర్కిల్, ప్యారడైజ్ సర్కిల్, బోట్స్ క్లబ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. శోభాయాత్ర నిర్వహించే మార్గాలలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.