నేడు ఆసిఫాబాద్‌లో పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పోడు భూములను సాగు చేసుకునే గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. నేడు పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా నుండి పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌, జిల్లా పోలీస్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల పైచిలుకు ఎకరాల భూమికి అడవి పుత్రులను హక్కుదారులను చేయనున్నారు. పోడు పంపిణీలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తర్వాత తెలంగాణ మూడోస్థానంలో సగర్వంగా నిలువబోతున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించాయి. 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. 12,49,296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్‌ను వివిధ స్థాయిలో పరిశీలించి, 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాల భూమిపై 1,51,146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్​ కుమార్ పోడుపట్టాలు పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాఠోడ్ పోడుపట్టాలు అందిస్తారు.