తెలంగాణ హైకోర్టు మరో చరిత్ర సృష్టించింది.. తొలిసారిగా తెలుగులో తీర్పు

Telangana High Court
Telangana High Court

తెలంగాణ హైకోర్టు మరో చరిత్ర సృష్టించింది. తొలిసారిగా తెలుగులో తీర్పు ఇచ్చి వార్తల్లో నిలిచింది. సికింద్రాబాద్‌ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది. వాస్తవానికి సుప్రీం కోర్టు, హైకోర్టులు తీర్పులను అందరికీ అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే వెలువరించాల్సి ఉంటుంది. సాక్ష్యాధారాలు, ఇతర పత్రాలు స్థానిక భాష లో ఉంటే వాటిని ఇంగ్లిష్‌లోని అనువదించి ధర్మాసనానికి అందించాలి.

కాకపోతే సుప్రీం కోర్టు, హైకోర్టుల రిజిస్ట్రీలు పిటిషన్లను స్వీకరించవు. అలాంటిది.. రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే తొలిసారి తెలుగులో తీర్పు చెప్పి, కొత్త చరిత్ర లిఖించారు న్యాయమూర్తులు. స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పు వెలువరించింది. తెలుగులో తీర్పు వెలువరించడం ద్వారా జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం కొత్త అధ్యాయానికి నాంది పలికింది.