ఏపీలో దొంగ ఓట్ల భాగోతం కొనసాగుతోందన్న టిడిపి నేతలు..సీఈవోకు ఫిర్యాదు

గతంలో చేసిన ఫిర్యాదుల పట్ల ఇప్పటికీ స్పందించలేదని అసంతృప్తి

tdp-leaders-meet-ap-ceo-and-complaint-against-bogus-votes

అమరావతిః ఏపీలో యధేచ్ఛగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని టిడిపి నేతలు నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఇవే అంశాలను టిడిపి నేతలు గతంలో పలుమార్లు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ నేడు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమా, వర్ల రామయ్య, బొండా ఉమ, అశోక్ బాబు, దివి శివరాం తదితర టీడీపీ నేతలు ఏపీ సీఈవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై క్షేత్రస్థాయిలో విచారించి, చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్ల నమోదుతో సరికొత్త రికార్డులతో జగన్ ప్రపంచంలోనే 8వ వింత నమోదు చేశాడని విమర్శించారు. 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో జగన్, అతని ప్రభుత్వం వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని గెలిచింది తప్ప, ప్రజాబలంతో కాదని స్పష్టం చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంపై టిడిపి న్యాయపరంగా, క్షేత్రస్థాయిలో పోరాడి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఆటకట్టిస్తుందని స్పష్టం చేశారు.

“2019 తర్వాత జరిగిన ఎన్నికలన్నింటిలో (ఏ ఎన్నికైనా సరే) జగన్ వ్యవస్థల్ని మేనిప్యులేట్ చేసి గెలిచాడు తప్ప, ప్రజాబలంతో కాదు. 2100 ఇంటి నంబర్లతో లక్షా 85 వేల దొంగ ఓట్లు చేర్పించారు. 14 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఇష్టానుసారం దొంగ ఓట్లు చేర్పించింది. ఈ దొంగ ఓట్ల తంతుకి సంబంధించిన ఆధారాల్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ముందు ఉంచాము.

ఒక్కో ఇంటిలో 50 నుంచి 500 వరకు దొంగ ఓట్లు చేర్పించారు. ఈ దొంగ ఓట్లపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కోరాం. తాము చెప్పిన అంశాలతో ఎన్నికల కమిషనర్ ఏకీభవించారు. మీరు చెప్పిన అంశాలు మా దృష్టికి కూడా వచ్చాయి అన్నారు. అయితే, చాలాచోట్ల బీఎల్ వో లు ఇంటింటికీ వెళ్లకుండా ఎక్కడో ఒకచోట కూర్చొని ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలపై టిక్కులు పెడుతున్నారని ఆయనతో చెప్పాం. దానివల్ల దొంగ ఓట్లు తొలగించడం సాధ్యంకాదని చెప్పాం.

కాబట్టి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్ లోని హౌస్ మ్యాపింగ్ సాయంతో బీఎల్ వో లు గ్రామానికి వెళ్లాక, ఇంటింటికీ తిరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చని చెప్పాం. మేం సూచించిన విధంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దొంగఓట్లను కట్టడి చేయడంపై తప్పకుండా ఆలోచిస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అక్టోబర్ 17 నాటికి ఓటర్ల జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ బయటకు వస్తుందని, దాన్ని మీ అందరికీ ఇస్తామని, అది చూశాక, మీరు చెప్పిన విధంగా ఇంకా దొంగఓట్లు ఉంటే, ఆధారాలతో సహా మరోసారి ఫిర్యాదు చేయాలని, అప్పుడు తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ చెప్పారు” అని అచ్చెన్నాయుడు వివరించారు.