అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

అకాల వర్షాలు మరోసారి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.. గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండడం తో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కోతకొచ్చిన మక్క, వరి చేన్లు నేలకొరిగిపోగా.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న వడ్లు తడిసిపోయాయి. వాన నీటిలో కొట్టుకుపోయాయి.

ఈ క్రమంలో అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో పంట నష్టం అంచనా వేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలను జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని సూచించారు.

మరోపక్క రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు ద్రోణి/ గాలిలోని అనిశ్చితి కారణంగా దక్షిణ చత్తీస్ గడ్ నుంచి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని అధికారులు తెలిపారు.