ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు : నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈరోజు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరుకాబోతున్నారు. కవిత విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో రాత్రి ఢిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీశ్‌ రావు, న్యాయనిపుణులతో సుధీర్ఘంగా చర్చించారు. కేసులో ఉన్న లోపాలు, న్యాయపరమైన అంశాలపై సమాలోచనలు చేశారు. ఇక కవిత విచారణ వేళ భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పెషల్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు సిసోడియా రిమాండ్‌ రిపోర్టులోనూ కవిత పేరు ప్రస్తావనకు రావడం కలకలం రేపుతోంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ట్విస్టుల మీద ట్విస్టుల మధ్య ఈరోజు ఈడీ ఎదుట హాజరుకాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ కేసులో ఇప్పటికే ఓసారి కవితను ప్రశ్నించిన ఈడీ.. మరోసారి కన్‌ఫ్రంటేషన్ ఇంటరాగేషన్‌ చేసే ఆలోచనలో ఉంది. ఏకకాలంలో సిసోడియా, కవిత, అరుణ్‌పిళ్లైను విచారించే ఛాన్స్ ఉంది. ప్రధానంగా అరుణ్‌ పిళ్లైతో కవిత ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ఫోకస్‌ పెట్టినట్లు సమాచారం. ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపైనా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ జరిగినట్లు, సౌత్‌గ్రూప్‌ను ఆపరేట్‌చేసిన వారిలో కవితదే కీలకమని ఈడీ స్పష్టం చేసింది. కవిత, మాగుంట శ్రీనివాస్‌ సౌత్‌ గ్రూప్‌కి నాయకత్వం వహించారని ఈడీ పేర్కొంది. 2021 మార్చి 19, 20న సిసోడియా ప్రతినిధి విజయ్‌నాయర్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. లిక్కర్‌ వ్యాపారంలో కవితకు మేలు జరిగేలా..అందుకు ప్రతిఫలాన్ని ఎలా తీసుకోవాలనే దానిపై చర్చించుకున్నారు. 2021 జూన్‌లో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఈ కుట్రకు బీజం పడిందని రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఐటీసీ హోటల్ మీటింగ్‌లో అరుణ్ పిళ్లై, విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి, దినేశ్ అరోరా పాల్గొన్నట్లు ఈడీ క్లారిటీ ఇచ్చింది. 100కోట్లు హవాలా మార్గాల్లో చెల్లించినట్లు సౌత్‌ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు చెప్పినట్లు సమాచారం. ఈ మొత్తం వాట్సాప్‌ సంభాషణను ఈడీ డీకోడ్‌ చేసింది. విజయ్‌నాయర్‌ను ‘V’ గా, కవితను ‘Madam’గా, సమీర్ మహేంద్రును ‘Samee’గా వ్యవహరిస్తూ చాటింగ్ చేసినట్లు గుర్తించింది. ‘V’ నీడ్‌ మనీ అన్న వ్యాఖ్యానికి విజయ్‌నాయర్‌కి డబ్బు కావాలని అర్ధమని పేర్కొంది. కవితకు దాదాపు 33శాతం వాటా ఇస్తామంటూ చాటింగ్‌ జరిగినట్లు ఈడీ గుర్తించింది.

వాస్తవానికి ఈనెల 9నే విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆరోజున విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. ఈనెల 11న విచారణకు హాజరుకానున్నట్లు చెప్పారు. మొత్తం మీద ఈరోజు ఈడీ విచారణ అనేది దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.