బీజేపీలో చేరికపై సుమలత క్లారిటీ

మాండ్యా నియోజకవర్గ ఎంపీ సుమలత బిజెపి లో చేరబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాను బిజెపి లో చేరడం ఫై క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిన ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సుమలత ..రాజకీయాల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. భర్త అంబరీశ్ మరణంతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంబరీశ్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ, ఎన్నికల్లో సుమలతకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇంట్రస్ట్ చూపించలేదు. దాంతో 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత మాండ్యా నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు.

ఇప్పుడు ఆమె బిజెపి లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారం అవుతుండగా..ఆ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈరోజు సుమలత మీడియా సమావేశం ఏర్పాటు చేయడం తో అంత కూడా ఆమె బీజేపీలో చేరడంపై ఓ ప్రకటన చేస్తారని భావించారు. అయితే, మీడియా సమావేశం నిర్వహించారు కానీ, తాను ఇప్పుడే బీజేపీలో చేరబోవడంలేదని స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని మీడియా ముఖంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల తనకు విశ్వాసం ఉందని, సన్నిహితులు, మద్దతుదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని సుమలత పేర్కొన్నారు.

మోదీ నాయకత్వంలో బీజేపీ స్థిరంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రపంచ దేశాల మధ్య భారత్ పలుకుబడి పెరగడం వంటి కారణాలు తనను బీజేపీ దిశగా నడిపించాయని వెల్లడించారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం తన కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది కాదని ఆమె స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం తన కొడుకు రాజకీయాల్లోకి రాడని ఆమె తేల్చి చెప్పారు. మాండ్యా జిల్లాలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తన లక్ష్యం అని ఉద్ఘాటించారు.