ఇదే చివరి వార్నింగ్ అంటూ పలువురు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్

దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, ఆ ఎమ్మెల్యేలకు ఇదే తన చివరి వార్నింగ్ అని సీఎం కేసీఆర్ వారికీ హెచ్చరిక జారీ చేసారు. మరోసారి తప్పు చేసినట్లు తెలిస్తే పార్టీ నుండి బయటకు పంపిస్తానని తేల్చి చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోను ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచించారు.

పార్టీలో నాయకులు ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకోవద్దని, ఎలాంటి సమస్య ఉన్నా అధిష్టానంతో చెప్పి ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికలే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలన్నారు. గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ లో ప్రతినిధుల సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు కేసీఆర్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సభలో మంత్రి కేటీఆర్‌ పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.

దేశంలో రైతు రాజ్యం స్థాపించాలని, ప్రతిరాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలని తీర్మానం చేశారు. 24 గంటల పాటు దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి కొత్త పాలసీ అమలు చేయాలని తీర్మానించారు. మన దేశ బ్రాండ్‌తో విదేశాలకు ఆ‍హార ఉత్పత్తుల ఎగుమతి, దళితబంధు దేశ వ్యాప్తంగా అమలు, దేశంలో భారీ స్థాయిలో మౌళిక వసతులు కల్పన, దేశంలో బీసీ జనగణన, ద్వేషాన్ని విడిచి ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలని తీర్మానం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు, పని చేయాలని తీర్మానించారు.