పల్నాడులో ట్రావెల్స్ బస్సు బోల్తా

శనివారం ఉదయం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి ఒంగోలు కందుకూరు వెళ్తున్న కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు.. అక్కడి కి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటు తెలంగాణ లోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్‌ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు దవాఖానకు తరలించారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని తెలిపారు. అంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. మృతులను వెంకటేశ్‌ (కారు డ్రైవర్), భార్య పుష్ప (35), తల్లి లత (55), వెంకటేశ్‌ చెల్లెలు కుమారుడు ఆదిత్య (6)గా గుర్తించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.