భారత అమ్ములపొదిలోకి చేరిన మరో అస్త్రం

ఐఏఎఫ్‌లోకి తేలికపాటి హెలికాప్టర్లు

Air Force gets first made-in-India light combat helicopters today

న్యూఢిల్లీః భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా తయారు చేసిన లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్స్‌ (LCH)ను సోమవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో జరిగిన కార్యక్రమంలో హెలికాప్టర్లను వాయుసేనలోకి ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్లు దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఎల్‌సీహెచ్‌ ఇండక్షన్‌కు నవరాత్రుల కంటే మెరుగైన సమయం, యోధుల భూమి రాజస్థాన్‌లో మరొకటి ఉండదన్నారు.

15 హెలికాప్టర్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేయగా.. పది ఐఏఎఫ్‌కు, మరో ఐదు భారత సైన్యం కోసం కేటాయించనున్నారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ వీటిని తయారు చేసింది. రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ తేలికపాటి ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు. శత్రు రాడార్లను బోల్తాకొట్టించే స్టెల్త్‌ సామర్థ్యం వీటికి ఉన్నది. నేలను బలంగా తాకినప్పటికీ తట్టుకోగలిగేలా దృఢమైన ల్యాండింగ్‌ గేరును వీటికి అమర్చారు. 5వేల మీటర్ల ఎత్తులోనూ ఈ హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతుంది. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్‌ చౌదరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/