కదిరిలో రెచ్చిపోయిన సీఐ మధు

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని దేవళం బజారులో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో కదిరి అర్బన్ సీఐ మధు రెచ్చిపోయాడు. మహిళలను అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడాడు. అమాయకులను చితకబాదాడు. అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయాడు. సీఐ మధు తీరు పట్ల స్థానికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే నెటిజన్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

కదిరి మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్‌ సుధారాణి ఇంటి ముందున్న దుకాణం రేకులను అధికారులు తొలగించేందుకు వెళ్లారు. దీంతో ఆమె తాము స్వచ్ఛందంగా తీసేస్తామని, అయితే అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను కూడా తొలగించాలని సూచించారు. దీంతో సీఐ రెచ్చిపోయారు. ‘‘మాతో మాట్లాడే స్థాయా నీది..?’’ అంటూ బూతులు తిట్టారు. దీంతో ఆగ్రహించిన తెలుగు మహిళలు శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఎన్జీవో కాలనీలో ఉన్న సీఐ మధు ఇంటివద్ద ధర్నా చేయడానికి వెళ్లారు. టీడీపీ మైనారిటీ నాయకురాలు ఫర్వీన్‌బానుతోపాటు వందమందికి పైగా మహిళలు అక్కడి వెళ్లారు. వారిని చూడగానే సీఐ మధు విచక్షణా రహితంగా లాఠీ చార్జి చేశారు. ఫర్వీన్‌బానును, ఆమె కుమారుడు రోషన్‌, తెలుగు మహిళలను చితకబాదారు. దీంతో మహిళలు భయంతో పరుగులు తీశారు. దీంతో కందికుంట వెంకటప్రసాద్‌ ఎన్జీవో కాలనీవద్దకు వచ్చారు. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి.

అనంతరం టీడీపీ నాయకులు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. వైసీపీ శ్రేణులతో కలిసి సీఐ మధు అక్కడికి చేరుకున్నారు. పోలీసు జీపు ఎక్కి మీసం మెలేసి, తొడ కొట్టారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. కదిరి సీఐ మధు తీరు ఫై టీడీపీ శ్రేణులు , స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ..మధు ను సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీఐ మీసాలు తిప్పి, తొడ కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఐ తీరు గుండాలు వ్యవహరించినట్టు ఉందని ఆరోపించారు. దీంతో ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా కదిరిలో భారీగా బలగాల మోహరించాయి. ఇదిలా ఉంటె ఈరోజు కదిరికి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ వెళ్లనున్నారు.