చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుఫై రాళ్ల దాడి

కేంద్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల ఫై వరుస రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాళ్ల దాడికి పాల్పడిన నిందితుల ఫై పలు కేసులు నమోదు చేస్తూ, పోలీసులు కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పలు చోట్ల రాళ్ల దాడులు జరుగగా..తాజాగా శనివారం చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుఫై రాళ్ల దాడి జరిగింది. శనివారం కృష్ణరాజపురం రైల్వే స్టేషన్‌కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వన్డే భారత్ (20607 ) రైల్ ఫై రాళ్ల దాడి చేసారు. ఈ ఘటనలో రైలులోని ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని కానీ సీ4 కోచ్ 10, 11, 12, సీ5 కోచ్ 20, 21, 22 కిటికీలు పగిలిపోయాయి.

ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సంఘటనా స్థలానికి చేరుకుని దుండుగుల కోసం గాలించారు. ఈ విషయంపై సౌత్ వెస్ట్రన్ రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కుసుమా హరిప్రసాద్ మాట్లాడుతూ.. దీనిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు నమోదు చేసిందని..నైరుతి రైల్వే శాఖ అధికారులు.. ఆర్పీఎఫ్, రాష్ట్ర రైల్వే పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది సాయంతో రైల్వే ట్రాక్‌ల పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారని వివరించారు. రైళ్లపై రాళ్లు రువ్వడం నాన్ బెయిలబుల్ నేరమని, రైలు ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగిస్తే, నేరస్తులకు జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, బెయిల్ కూడా రాదని అధికారులు హెచ్చరించారు.