ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు

హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు

AB Venkateswara Rao
AB Venkateswara Rao

అమరావతి: ఏపికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపి హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ అజయ్ రోస్తగిల ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్ ను ఏబీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ ఉన్నప్పుడు… తన కుమారుడి కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేసి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఆయన ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది. ఆ తర్వాత ఏబీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను నిలిపేస్తూ హైకోర్టు స్టే విధించింది. తాజాగా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/