ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం

ఏపీకి నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసారు. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో అబ్దుల్ చేత హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మూడో గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ స్థానంలో అబ్దుల్‌ నజీర్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. బిశ్వభూషణ్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించారు. వీరితోపాటు మరో 10 మంది గవర్నర్లు నియమితులయ్యారు. ఇక అబ్దుల్‌ నజీర్‌ విషయానికి వస్తే.. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. తర్వాత 2003లో కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. అదేవిధంగా 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన ధర్మాసనంలో ఏకైక మైనారిటీ న్యాయమూర్తిగా ఉన్నారు.