నేటి నుండి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా ప్లీనరీ సమావేశాలు

Congress` 85th Plenary Session Begins In Raipur Today; Gandhis To Skip Key Meet On CWC Polls

న్యూఢిల్లీః ఈరోజు నుండి కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా ఈ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో మొత్తం 6 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు ఈ తీర్మానాలను ఖరారు చేస్తారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించే అంశంపై కూడా స్టీరింగ్ కమిటీ చర్చించనుంది. మరోవైపు ఎన్నికల గురించి జరిగే చర్చకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెపుతున్నారు.